Wednesday, March 16, 2011

వేమన్న విరహం!

తుంట వింటి వాని తూపుల ఘాతకు 
మింటి మంటి నడుమ మిడుక తరమె?
ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా
విశ్వదాభిరామ వినుర వేమ.
                 ......విరహం గురించి వేమన చెప్పిన పద్యమిది! 

మింటి - మంటి నడుమ...
అంటే, భూమి - ఆకాశాల నడుమ ప్రేమ రగిలించే 
విరహం కన్నా... గొప్ప బాధ ఇంకోటి లేదని వేమన చెబుతున్నాడు. 
ప్రేమికుడిగా జీవితాన్ని మొదలు పెట్టిన వేమన...
విరహం నుంచే విరాగిగా మారిన వాడు.
కనుకనే అదెంత బాధాకరమో చెప్పగలిగాడు.  

స్త్రీ, పురుష సంబంధాలను గురించి
వేమన్న అభిప్రాయాలను చూస్తే...
అవి మానవ జీవన ప్రయాణంలో...
పలు దశలుగా ఆయన భావించినట్లు ఉంది.
అవి తన స్వంత విషయాలుగా ఆయన చెప్పకున్నా,
జన పదుల కథల్లో మాత్రం ఆయనే నాయకుడు. 

.....చెరుకు విల్లు లోంచి మన్మథుడు వదిలే 
బాణాల దెబ్బకు కలిగే మోహం ఇంతింత కాదు...
ఆ విరహ వేదనకు పైన ఆకాశం, కింద భూమి సాక్షం!
ఎవరికోసమీ బాధ?
ప్రేయసి కోసమేగా!

కానీ, ఇక్కడ వేమన్న 'ఇంటియాలి విడిచి' అంటాడు
అంటే, అప్పటికే వేమన్న పెళ్లి చేసుకుని గృహస్థుడయ్యాడని, 
జానపదుల వాడుక కథ.
ఇలా వేమన్న ఇల్లాలి కోసం భర్త పడే విరహ వేదనను వివరించాడు.
ఏం, ఎప్పుడూ ఇంట్లో ఉండే భార్య ఇంట్లో లేదా?
బహుశా పుట్టింటికి వెళ్లిన్దేమో?
బంధువుల పెళ్లికి వెళ్లిన్దేమో?
గుడికో, నీళ్ల కోసం చెరువుకో, ఏ పేరంటానికో వెళ్లిన్దేమో?
ఆమె వచ్చే లోగా ఆయన మన్మథుడి బాణాలు తగిలి ఇల్లాలి కోసం 
విరహ వేదన చెందుతూ...
ఆమెను వదిలి ఎలా ఉండటం? 
విరహమంతటి దుర్భర బాధ లేదని, 
భూమ్యాకాశాల నడుమ విరహాన్ని ఓర్చుకునే పరిస్థితి లేదని అంటున్నాడు!

ఇదే విరహాన్ని వేమన్న పలు సందర్భాల్లో స్త్రీలకు కూడా వర్తింప చేశాడు.
...స్త్రీలు కూడా మనుష్యులేనని, 
వారు వస్తువులు కాదని,
వారికీ రక్త, మాంసాలున్న శరీరాలున్నాయని,
వాటిలో హృదయాలున్నాయనీ,
స్త్రీ మనసులోనూ కోరికలుంటాయనీ, 
విరహం వారిని కూడా వేధిస్తుందని... 
ఆ మహా కవి, ఆ సామాజిక వేత్త... 
ఏనాడో స్త్రీల పట్ల...తన సహానుభూతిని చూపాడు.

గమనిక: భర్తలతో సయోధ్య లేని భార్యల గురించి అనేక పద్యాలు చెప్పాడు వేమన్న.
అలాగే వేశ్యా జీవితాలను గురించి కూడా చెప్పాడు. 
కానీ ఎక్కడా ఆయన ఆ వ్యవస్థను సమర్థించిన దాఖలాలు లేవు.
స్త్రీ, పురుషుల మధ్య విరహం ఉంటే...
అది అన్యోన్య జీవితమని ఆయన అభిప్రాయం.
ఇక, అది ఒక అన్యోన్య సమాజానికి నాంది అన్నది ఒప్పుకో తగినదే. 

కానీ ఇప్పటికీ ఈ ఆధునిక యుగంలో స్త్రీని, 
ఒక నడిచే బొమ్మగా చూసే వాళ్లే ఎక్కువగా ఉండడం...
ఒక సామాజిక, సామూహిక వ్యాధి!  
(ఆచార్య ఎన్. గోపి - వేమన్న వెలుగులు - inspirationతో...)  

Tuesday, March 8, 2011

ప్రేమతో స్త్రీలకు...


మనిషి తనపై తాను వేసుకున్న మచ్చ ఇది!
స్త్రీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కిన  పురుష స్వామ్య సమాజం...
ప్రేమ విషయంలోనూ తన ఉనికి నిలబెట్టుకుంది.
ప్రేమ, శృంగార భాగ స్వామ్యంలో స్త్రీలకు ఎడారి దారులే మిగిల్చారు.
ఒక పురుషుడు ఎంత మందినైనా ప్రేమించ వచ్చు,
ఎన్ని పెళ్లిల్లైనా చేసుకోవచ్చు, 
చాలక, విచ్చలవిడి శృంగార స్వేచ్చకు... వేశ్యా వ్యవస్థను ఏర్పరిచారు.
కానీ స్త్రీకి ఏ అవకాశమూ లేకుండా కట్టడి చేశారు.
ఆమె ప్రేమించ కూడదు, మోహించ కూడదు, విరహించ కూడదు!
భర్త ఉన్నా, లేకున్నా, ఉండీ లేకున్నా ఆమెకు ప్రేమ లేదు, తోడు లేదు.
గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి కోరికలు తీర్చుకునే మగ వేశ్యా వ్యవస్థా లేదు!!!
కానీ ఇప్పుడిప్పుడే కాస్త female human spicesకు కూడా 
ప్రేమానుభావాలు నోచుకునే ధైర్యం కలుగుతోంది.
కానీ వారికీ... ఇంటా, బయటా, ఆడా, మగా, చిన్నా, పెద్ద, మేధావీ, అజ్ఞానీ 
అంతటా వ్యతిరేకతనే... 
చీత్కారాలు, చీదరింపులూ, అవమానాలు, అధిక్షేపణలు.
వారిని అర్థం చేసుకునే మనసు, చేసుకోవాలన్న కనీస ధర్మమూ 
ఎవరూ గుర్తు చేసుకోము.
రోజువారీ జీవితంలో మనం ఎంతో మంది ఇలాంటి వారిని చూస్తూ ఉంటాం.
తిట్టుకుంటూ ఉంటాం. 
వెంటనే ఒక దరిద్రపు నిర్ణయానికి వస్తాం.
వాళ్లు చాలా బ్యాడ్ అని చాటింపు వేస్తాం.
అక్కడితో ఆగక, ఎప్పుడు వారి ప్రస్తావన వచ్చినా 
చెడా, మడా నోరు పారేసుకుంటే...గానీ శాంతించం.
మనిషై పుట్టినందుకు ఓ మచ్చను పుట్టించామిలా...
ఆకలీ, నిద్రా, మైధునాలు జీవులకు సహజమని ఒప్పుకోం!
అందరిలాగే నేను కూడా... 
ఎంతో మంది...స్త్రీల హృదయాల ఆకలిని అపార్థం చేసుకుని తప్పుగా తిట్టుకున్నాను. 
అలాంటి ఎంతో మంది సాటి స్త్రీలకు....
ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మర్యాదగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను!!