Monday, November 28, 2011

ప్రేమిస్తే = ప్రేమ..,ఇస్తే...


గుండె నిండా ప్రేమ కావాలి
కొండంత కాంక్ష కావాలి
ఆకాశాన్ని నింపే ఆరాధన కావాలి
నాలుగు కళ్లు కలిసిన చోట...కాలం ఆగాలి!
నన్ను చూసినప్పుడు మెరిసే నీ కళ్ల కాంతికి..
వెన్నెల చిన్నబోవాలి
ఆ కన్నులలోని అనురాగం చలువకు..
చందమామ..విస్తుపోవాలి
నీ చూపులు రేపే తాపానికి.. 
సూర్యుడు సిగ్గుపడాలి 
నీ సౌందర్య దాహం చూసి..
జలపాతాల గుండె జలదరించాలి
నా తనుల్లతను పాకే నీ చూపుల ప్రయాణం చూసి..
పర్వతాలు, లోయలు నీ పాదాక్రాంతం కావాలి
ఏ మలుపులో ఎప్పుడు దాడి చేస్తావో తెలియక..
నా అందం నీకు బందిపోటు అనే బిరుదును ఇవ్వాలి
నీ చేతులు ఎక్కడ నాట్యం చేయాలని తలపోస్తానో..
అక్కడ అరక్షణం ముందే నీ స్పర్శలు జ్వలించాలి
అణువణువునూ అరలు చేసీ దాచుకున్న స్త్రీ సంపదను..
నిలువు దోపిడీ చేయడానికి నా బదులు నువ్వే మొక్కుకోవాలి
ఒక్క సారి నా కళ్లు నేల వాలాయంటే..
వెయ్యి సార్లు ఆ తలుపుల ముందు తమకంతో తచ్చాడాలి 
అందాన్ని ఆస్వాదించే పందెంలో..
కాలంతో పోటీ పడాలి
అనుక్షణం నీ ఊపిరి ఊదే వేణుగానంలో..
నా తనువును తడిపేయాలి
నీ శ్వాసా, భాషా, ఊసూ, ఊహ..
అన్నీ నా గురించే అజపా జపం చెయ్యాలి
నా..అధారామృతాల మత్తులో..
ఆజన్మాంతం ఓలలాడాలి
నా కనుపాపల కొలనులో..
నిరంతరం నీ ప్రతిబింబం ఈదులాడాలి
వసంత కోకిలల్లా...
నీ పెదాలు సదా నా నామస్మరణం చేస్తుండాలి
ఎండకన్ను సోకకుండా నా సోయగాలకు..
నీ చాతీ ఛత్రం కాపు ఉంచాలి
గాలి గాయాలు చేయకుండా..
గాఢ పరిష్వంగంలో పరిరక్షించాలి
పూదోటలో తిరిగే ఎలదేటి రొదలా..
నీ చుంబన ఝూంకారాలు.. నా గుండె చుట్టూ గిరికీలు కొడుతూ ఉండాలి
వలపు వర్షం కురిసే వేళ తనువులు..  
మేఘ పర్వతాల్లా విజ్రుమ్భించి, విద్యుల్లతలు విరబూయాలి
నీ మనసులోని మమతను హరివిల్లుని చేసి..
నన్ను ఊయలలూపాలి
సుదూరంగా భూమ్యాకాశాలు కలిసే కలకు..
నా నడుము వొంపును వంతెనగా వాడాలి
పట్టమహిషిగా నన్ను ప్రతిష్టించడానికి..   
ఓ ప్రణయ సామ్రాజ్యాన్ని జయించే కండబలం నీ గుండెకుండాలి
నా సౌందర్య వనంలో ప్రవేశించడానికి..
అంగీకార పత్రాలతో పనిలేని సాహస సంప్రదాయముండాలి
నేను..నీదై ఉండాలి
నువ్వు..నేనై ఉండాలి
ఆ ఉండటంలోనూ నీ ఉనికిని నేనై ఉండాలి
నా తనుహృదయాలు నీతో నిండాలి!