Wednesday, July 21, 2010

నేను - ప్రేమ

ప్రేమతో,
ప్రేమతో నేను...
ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాను
అది నా నిత్య జీవితపు భాగస్వామి
నా మనసుకు ఊపిరానివ్వని ఊహల ఊసులను నూరిపోస్తున్ది
హృదయానికి తీయని తలంపుల పరమాన్నం పెట్టి పోషిస్తుంది
తనువును పులకింతల పూవులతో మైమరపిస్తుంది
చందమామ కథల నుంచీ చంద్రయాన ప్రయోగాల వరకూ...
ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంది.
అల్లి బిల్లి అమాయకత్వంలోను
కన్నీటి కలతలలోనూ,
అజ్ఞానపు అందములోనూ
విజ్ఞానపు వేదికలోనూ
నన్ను వేటాడుతూనే ఉంది!
నా తొలి వేకువతోనూ ముని మాపుతోనూ దానికి సంబంధం లేదు
మనసుకు... వయసు రెక్కలు మొలవకుండా తన బానిసగా నన్ను...
భూమ్యాకాశాల నడుమ భద్రపరచుకుంది!
ఆ విశాలాకాశపు నేల మీద...
వసంతాలు వస్తున్నాయి, చెట్లు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి
కానీ, ప్రేమ చెట్టు కొమ్మన... నన్నెప్పుడూ వసి వాడని పసి మొగ్గను చేసి,
తీరని దాహాల దారాలతో ముడేసుకుంది.
ముడి వీడని ఆ బంధాలతో...
నన్ను నేను ప్రేమించుకుంటున్నాను
ప్రకృతిని ప్రేమించుకుంటున్నాను
ప్రపంచాన్ని ప్రేమించుకుంటున్నాను
ప్రేమను ప్రేమించుకుంటున్నాను...
.............
ప్రేమతో ప్రేమను ప్రేమిస్తున్నాను...

No comments:

Post a Comment