Monday, November 19, 2012

రెండక్షరాలతో రెండు హృదయాలు...

రెండు ప్రాణులు...
ఇద్దరు స్త్రీ, పురుషులు 
ఒకరినొకరు పొందాక..
...మగ ప్రాణం ప్రశాంత, సమాధి స్థిత నిద్రలోకి జారుకుంటుంది.
సరిగ్గా అప్పుడే ఆడ ప్రాణి ఆత్మలో విరహం మేల్కొంటుంది...
( ప్రేమలో పడిన ప్రతి సందర్భంలో...)

Thursday, July 19, 2012

ప్రేమ సవ్వడి


చూపులు కలిసిన శుభ వేళ...
విరహం గూటిలో గువ్వలు వాలుతాయో, లేక
గువ్వల గుండెల్లో విరహం వాలుతుందో తెలియదు గానీ
విరహం గూటిగా మారిన హృదయంతో..
తనువొక ధనువై
మనమొక శరమై
పలుకొక పదమై
కులుకొక సుమమై 
చూపొక జ్వల అయి
కలవరాల వలలో చిక్కిన రామచిలుక..
విలుకాని కంటి సొగసుకు బందీ అయి 
మదిని కదిలే అలలకు కదిలీ, 
తావిని వదిలిన కుసుమమై 
పలవరింపుల పాటల మాలికలతో 
గుమికూడిన గుబులు గుళికలతో
ఊపిరి కొనల్లో ప్రాణం ప్రణయమై..,
విరహ తాపాలు పరిణయాల విందుకు పయనమై
కొత్తగూటి కోరికలతో 
కొమ్మలు విడిచిన కోయిలలు కలలుగన్న ఆ క్షణాలు..
కలుసుకున్న తరుణాన...
వేణువూ, గానమూ వేరుగా ఉండనేరవు
బింబాలు, ప్రతిబింబాలు కుదురుగా ఉండ జాలవు 
ఎద లయల గతి మారి చుంబన ధ్వనులు వెల్లివిరుస్తాయి..
ఆ ప్రేమ సవ్వడిలో నిశ్శబ్దం నిరీక్షిస్తూ ఉంటుంది.. ఉనికిని నిరూపించుకోడానికి!