Wednesday, October 19, 2011

నన్ను నువ్వు అందుకోగాలవా?

నా తనువులోని 
అణువణువులోని
సౌందర్యాన్ని...
వెదకి చూస్తావని
ఎంతో ఎదురు చూశాను...
నా మనసులోని 
మార్మిక మర్యాదల 
పరదాలు తొలగించి...
నన్ను వెలికి తీస్తావని
ఎంతో తపన చేశాను...

...ఎగుడు, దిగుడులనూ
మట్టి కుప్పలనూ
రాళ్ల దిబ్బలను 
ఇసుక తిన్నెలనూ దాటుతూ..
కను సన్నల కాటుక చెదరకుండా 
ఎంతో నిష్టగా తనను తాను
భూమికి అలంకరించుకున్న 
నది విద్వత్తు...
నిత్యం నీళ్లలో ఈదులాడే చేపలకెలా తెలుస్తుంది?
ఆకాశంలో ఎగిరే పక్షులు మాత్రమే 
దాన్ని ఆపాదమస్తకం ఆస్వాదించగలవు...
ఆ గల, గలల సంగీతాన్ని 
గాలి మాత్రమే మూట విప్పగలదు...

...రివ్వున ఓ పక్షి 
క్రిందకు దూసుకు వచ్చి 
చటుక్కున... ఓ చిటికెడు నీళ్లను  
గుటుక్కుమన్నప్పుడు...
అప్పుడు...
నది అంతరంగంలో 
కలిగే గగుర్పాటును 
గగనం మాత్రమే గమనించగలదు!

అలల అలజడులైనా 
కలల అంచనాలైనా
ఒడ్డును తాకాలనే ఒరుసుకుంటాయి.
అలల కవ్వం చిలికే వెన్న 
ఆకాశంలో పరచుకునే వెన్నెల కన్నా 
తక్కువేం కాదు...

నా కాటుక కళ్ల ద్వారాల గుండా 
ఒక్క సారి ఆ ఉదాసీన ఉద్యాన వనాలు దాటి..,
వన విహారాలు చెయ్యి..!
నీ తోటల్లో నీకు తెలీకుండా నిషిద్ధపరచబడిన
నిలువెత్తు వృక్షాలు, వాటి మధురోహల ఫలాలు 
నీ చేతికందే ఈ చోట...
రహష్య ఆనందాలు 
ఆనంద రహష్యాలు
అరహష్య సుఖాల తుంపరలుగా
నిన్ను, నిలువెల్లా కమ్ముకుంటాయి...

...అప్పుడు...
ఆ మంచు పూల తోటలో 
తుమ్మెదలా నీవు
నా మకరంద గ్రంధాలను చదవడంలో నిమగ్నమవుతావు...
పక్షిలా.. మమేక దీక్షతో దూసుకు వస్తూ...
చటుక్కున.., ఓ చిటికెడు సొగసును 
జుర్రుకున్నప్పుడు...
అప్పుడు...
నా అంతరంగంలో
రేగే అలజడి స్పర్శను...
నువ్వు తప్ప ఆకాశం కూడా అందుకోలేదు!!
ఇలా.., నన్ను నువ్వు...సజీవంగా అందుకో.. గలవా??
నువ్వీ తన్మయోన్మత్త స్పర్శను అందుకోలేక..పొతే.., మనం...
పడవలో విరహించే నావికుడిగా నువ్వు...
నీ గురించే విహరించే స్వప్నికగా నేను...
మిగిలిపోతాం...రెండు హృదయాలుగా!!!
 

2 comments:

  1. "శీతవేళ రానీయకు
    శిశిరానికి తావీయకు
    ఎదలోపలి పూలకారు పోనీయకు..!!"

    Good one!!!

    ReplyDelete
  2. మార్మిక మర్యాద ... గాలి మాత్రమే మూట ... అలల కవ్వం చిలికే ... ఉదాసీన ఉద్యాన వనాలు ... నిషిద్ధపరచబడిన నిలువెత్తు వృక్షాలు ... మకరంద గ్రంధాలు ... చిటికెడు సొగసు ... తన్మయోన్మత్త స్పర్శ ...
    Ee padalu Hrydyaaniki hatthu konela, Mee Manobhavaniki addam pattelaa unnai ! Wish U all the Best.
    - Chandra Sekhar Reddy.

    ReplyDelete