Thursday, October 27, 2016

పునరావృత్త















నిప్పు
...ఎగిసేటప్పుడో 
నీరు
...ఆర్పేటప్పుడో 

నిప్పూ-నీరూ కలిసినప్పుడు..
ముఖాముఖి కలబడే ఆ కదనరంగంలో
అప్పుడు..
ఆవేశం రగిలే ఆ నివేశంలో
ఎవరు ఎవరిని గెలిపిస్తారో
ఎవరి ఒళ్లును ఎవరు అల్లుకుపోతారో
నిప్పై మిగులుతారో
నీరై కరుగుతారో 
ఆవిరై అంతర్ధానమే అవుతారో..

నువ్వు 
...నడిచేటప్పుడో  
నేను 
...ఎదురైనప్పుడో 

నువ్వూ-నేనూ
నువ్వో, నేనో తేల్చుకునే క్షణాలొచ్చినప్పుడు
అప్పుడు..
యుద్ధం జరిగే ఆ సన్నివేశంలో
ఎవరు ఎవరిని ఓడిస్తారో
ఎవరి హృదయాన్ని ఎవరు ఆక్రమిస్తారో
ఇద్దరుంటారో
ఒక్కరవుతారో 
ఇద్దరూ మాయమే అవుతారో..

ఆకాశం 
...కురిసేటప్పుడో 
భూమి 
...మొలిచేటప్పుడో 

ఆకాశం-భూమి
దూరంగా ఒకరిలో ఒకరు కలిసే కౌగిలి చిత్రపటంలో 
అప్పుడు..
చోటుచేసుకునే ఆ మహాభినివేశంలో
ఆకాశమే వంగుతుందో
భూమే అందుతుందో
ఆకాశమై ఎగురుతారో
భూమి అయి మిగులుతారో 
అనంతంలో ఐక్యమే అవుతారో.. 

కదలికలో
నిశ్చలిలో
ధ్వనిలో
నిస్సడిలో
బిందువులో
సింధువులో
అంకురంలో
అనంతంలో
అంతరంగంలో
దిగ్దిగంతంలో
అణువులో
అనేకంలో..

అప్పుడూ
ఇప్పుడూ
ఎప్పుడూ..
కాలం వ్యవధులూ, స్థలం అవధులూ లేని
ప్రేమ సుధా మధు రసామృత  వర్షపు చినుకులను గ్రోలి ఆస్వాదించే చకోరాన్నై..
..అనంతాంతరిక్ష ఆవర్తనాలలో పునరావృత్తను అవ్వడమే  నా మోక్ష మార్గం! 

No comments:

Post a Comment